మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారుల పనితీరుకు తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో వారి భాగస్వామ్యమే గీటురాయి అని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. ఈ సీజన్లోనే 46 కోట్ల మొక్కలు నాటి, వాటిని సంరక్షించాలని లక్ష్యంగా పెట్టుకున్నందున ప్రతీ ఒక్కరు ఎవరికి వారు కార్యాచరణ రూపొందించుకుని అమలు చేయాలని సిఎం ఆదేశించారు. సోమవారం నుంచి తానే స్వయంగా ఆకస్మిక సందర్శనలు జరుపుతానని సిఎం స్పష్టం చేశారు. ఆయా జిల్లాలు, నియోజకవర్గాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు హరితహారం కార్యక్రమంలోనే ఉండాలని, తాను వారు పాల్గొనే కార్యక్రమానికి ముందు ప్రకటించకుండానే వచ్చి పాల్గొంటానని సిఎం వెల్లడించారు.
క్యాంపు కార్యాలయంలో శుక్రవారం సిఎం హరితహారం కార్యక్రమాన్ని సమీక్షించారు. మంత్రి హరీష్ రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, సిఎంఓ ముఖ్య కార్యదర్శి నర్సింగ్ రావు, సీనియర్ అధికారులు ఎస్.కె. జోషి, రామకృష్ణ రావు, నవీన్ మిట్టల్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా ఇన్ చార్జిలుగా వ్యవహరిస్తున్న మంత్రులతో కూడా ముఖ్యమంత్రి ఫోన్లో మాట్లాడారు. తెలంగాణకు హరితహారం కార్యక్రమం పురోగతిని అడిగి తెలుసుకున్నారు. వివిధ వర్గాల ద్వారా తెప్పించుకున్న సమాచారానికి అనుగుణంగా ఆయా జిల్లాల మంత్రులకు సిఎం పలు సూచనలు చేశారు.
జిల్లా, నియోజకవర్గం, మండలాల వారీగా ప్రణాళిక రూపొందించుకుని కార్యాచరణ అమలు చేయాలని సిఎం చెప్పారు. మున్సిపల్ కార్పొరేషన్లు కూడా హైదరాబాద్ తరహాలో డివిజన్ల వారీగా ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించారు. ఈ ప్రణాళికలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి పంపాలని సూచించారు. ఈ సారి రాష్ట్ర వ్యాప్తంగా మంచి వర్షాలున్నాయని, పంటలు కూడా బాగా పండుతున్నాయని సిఎం అన్నారు. ఇలాంటి సానుకూల వాతావరణాన్ని మొక్కల పెంపకానికి బాగా ఉపయోగించుకోవాలని సూచించారు. పెట్టిన మొక్కలు ఎట్టి పరిస్థితుల్లో ఎండి పోకుండా చూసుకోవాలని చెప్పారు. కొద్ది రోజుల పాటు వర్షాలు కురవకున్నా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని చెప్పారు. అగ్నిమాపక దళం ఫైర్ ఇంజన్లను ఉపయోగించుకోవాలని, గ్రామ పంచాయితీలు, మున్సిపాలిటీలలోని మంచినీటి ట్యాంకర్లను కూడా మొక్కలకు నీరు పోయడానికి వినియోగించుకోవాలని చెప్పారు. మొక్కలకు నీరు పోసే పనిలో ఉన్న ఫైర్ ఇంజన్ల డ్రైవర్లకు వాకీ టాకీలు కూడ ఇవ్వాలని, ప్రమాదాలు సంభవిస్తే వెంటనే అక్కడికి వెళ్లాలని సిఎం చెప్పారు. నీళ్లు లేక మొక్కలు ఎండి పోయాయని చెప్పే పరిస్థితి ఎక్కడా తలెత్తవద్దని ఆదేశించారు.
మొక్కలు నాటడం, రక్షించడం, నీళ్లు పోయడం లాంటి పనులకు నిధుల కొరత లేదని సిఎం అన్నారు. రూ.1500 కోట్ల కాంపా నిధులు అందుబాటులో ఉన్నాయని, ఇతరత్రా నిధులు కూడా ఖర్చు పెట్టుకునే వెసులుబాటు ఉందని సిఎం అన్నారు. ఎమ్మెల్యేలు, ఎంపిలు, ఎమ్మెల్సీలు, అధికారులు అంతా చివరి మొక్క నాటే వరకు యుద్దం చేసిన రీతిలో ఇదే పనిలో ఉండాలని ఆదేశించారు. గ్రామ పంచాయితీ పరిధిలో సర్పంచ్, విఆర్ఓ, విఎఓ, ఇతర అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది అంతా మొక్కలు నాటే పనిలోనే నిమగ్నం కావాలని చెప్పారు. 46 కోట్ల మొక్కలను నాటే వరకు ఉద్యమ స్ఫూర్తితో పనిచేయాలని చెప్పారు. మంత్రులు, కలెక్టర్లు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు ప్రతీ రోజు ఇదే కార్యక్రమంలో పాల్గొనాలని, తాను కూడా సోమవారం నుంచి ఆకస్మిక పర్యటనలు జరుపుతానని వెల్లడించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు హరితహారంలో పాల్గొన్న తీరుపైనే వారి పనితీరును అంచనా వేస్తామని స్పష్టం చేశారు. ఇప్పటికే వివిధ మార్గాల ద్వారా తనకు సమాచారం అందుతున్నదని, దానిని బట్టి వారి సామర్థ్యాన్ని, ప్రజోపయోగ కార్యక్రమాల్లో వారి చొరవను అంచనా వేస్తున్నామని చెప్పారు.