షాద్నగర్ను రెవెన్యూ డివిజన్ చేయాలని, అదే నియోజకవర్గంలోని నందిగామను మండలం చేయాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ ఆదివారం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రిని కలిశారు. కొత్తూరు, కేశంపేట, ఫరూక్ నగర్, కొందురుగు, చౌదరి గూడెంతో పాటు కొత్తగా ఏర్పాటయ్యే నందిగామ మండలాలు, షాద్నగర్ మున్సిపాలిటీతో కలుపుకుని రెవెన్యూ డివిజన్ చేయాలని ఎమ్మెల్యే విన్నవించారు. కొత్తూరు మండలం అతి పెద్దగా ఉన్నందున ఆ మండలంలోని నందిగామను మండల కేంద్రంగా చేసి చుట్టూ ఉన్న ఎనిమిది గ్రామాలు కలపాలని కోరారు. దీనిపై అప్పటికప్పుడే ముఖ్యమంత్రి మహబూబ్ నగర్, రంగారెడ్డి కలెక్టర్లతో మాట్లాడారు. జనాభా, విస్తీర్ణం తదితర వివరాలు తెప్పించుకున్నారు. ఈ రెండు ప్రతిపాదనలు ఆమోదయోగ్యమే అని తేలడంతో రెండింటికి అంగీకారం తెలిపారు. తుది ముసాయిదాలో పొందు పరచాలని చెప్పారు.