శ్రీశైల దేవస్థానం:మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో పదో రోజు (13.03.2021) న ఉదయం శ్రీ స్వామి అమ్మవార్లకు విశేష పూజలు జరిగాయి. తరువాత శ్రీ స్వామివారి యాగశాల లో శ్రీ చండీశ్వరస్వామికి ప్రత్యేక పూజాదికాలుచేసారు.రుద్రహోమం, చండీహోమం జరిగాయి.తరువాత యాగ పూర్ణాహుతి, వసంతోత్సవం, అవబృధం, త్రిశూల స్నానం, కార్యక్రమాలు జరిగాయి.
పూర్ణాహుతి కార్యక్రమంలో శాస్త్రోక్తంగా నారికేళాలు, పలు సుగంధ ద్రవ్యాలు, ముత్యం, పగడం, నూతన వస్త్రాలు మొదలైన ద్రవ్యాలను హోమగుండంలోకి ఆహుతిగా సమర్పించి యాగ కార్యక్రమాన్ని పూర్తి చేసారు.అనంతరం జరిగిన వసంతోత్సవంలో ఆలయ అర్చకులు, వేదపండితులు వసంతాన్ని పసుపు , సున్నం కలిపిన మంత్ర పూరిత జలం సమంత్రకంగా భక్తులపై ప్రోక్షించారు.
తరువాత జరిగిన అవబృథస్నానంలో చండీశ్వరస్వామికి ఆలయ ప్రాంగణంలోని మల్లికా గుండంలో ఆగమశాస్త్రోక్తంగా స్నానాదిక కార్యక్రమాలు నిర్వహించారు. చివరగా త్రిశూలస్నాన కార్యక్రమం జరిగింది .
ధ్వజావరోహణ:
ఈ బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈ రోజు (13.03.2021) సాయంకాలం ధ్వజావరోహణ కార్యక్రమం ప్రత్యేకం.
ఈ ధ్వజావరోహణ కార్యక్రమంలో ఉత్సవాల మొదటిరోజున బ్రహ్మోత్సవ ప్రారంభ సూచకంగా ఆలయ ప్రధాన ధ్వజస్తంభంపై ఆవిష్కరింపజేసిన ధ్వజపటం అవరోహణ శాస్త్రప్రకారం జరిపారు.
సదస్యం – నాగవల్లి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగానే ఈ రోజు (13.03.2021) నిత్య కల్యాణ మండపంలో సదస్యం, నాగవల్లి కార్యక్రమాలు జరిగాయి.
సదస్యం కార్యక్రమంలో వేదపండితులచే వేదస్వస్తి నిర్వహించారు.
వేదస్వస్తిలో వేదపండితులు చతుర్వేద పారాయణలతో, స్తోత్రాలతో శ్రీస్వామి అమ్మవార్లను స్తుతించారు.
ఆ తరువాత నాగవల్లికార్యక్రమంలో మహాశివరాత్రి రోజున కల్యాణోత్సవం జరిగిన శ్రీ భ్రమరాంబాదేవి వారికి ఆగమశాస్త్రం సంప్రదాయం మేరకు మెట్టెలు,నల్లపూసలు సమర్పించారు.
ముగియనున్న బ్రహ్మోత్సవాలు
ఈ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు రేపటితో (14.03.2021) న ముగియనున్నాయి. ఈ ఉత్సవాల ముగింపులో భాగంగా 14 న ఉదయం శ్రీస్వామి అమ్మవార్లకు విశేష పూజలు చేస్తారు.
రేపు సాయంకాలం శ్రీ స్వామివార్లకు అశ్వవాహనసేవ , ఆలయ ఉత్సవం చేస్తారు. ఆలయ ఉత్సవం అనంతరం శ్రీస్వామిఅమ్మవార్లకు పుష్పోత్సవం, శయనోత్సవం జరుగుతుంది.