శ్రీశైల దేవస్థానం: లోక కల్యాణం కోసం షష్ఠిని పురస్కరించుకుని దేవస్థానం ఈ రోజు 11 న ఉదయం ఆలయప్రాంగణంలోని శ్రీ సుబ్రహ్మణ్యస్వామి (కుమారస్వామి) వారికి విశేషపూజలను నిర్వహించారు.ప్రతి మంగళవారం, కృత్తికానక్షత్రం, షష్ఠి తిథి రోజులలో శ్రీ సుబ్రహ్మణ్యస్వామి వారికి ఈ విశేష అభిషేకం, పూజాదికాలు దేవస్థానం సేవగా (సర్కారి సేవగా) నిర్వహిస్తారు. ఈ అభిషేకానికి ముందుగా దేశం శాంతిసౌభాగ్యాలతో విలసిల్లాలని, ప్రకృతి వైపరీత్యాలు సంభవించకుండా సకాలంలో తగినంత వర్షాలు కురిసి, పంటలు బాగా పండాలని, పాడి సమృద్ధిగా ఉండాలని, జనులకు ఆయురారోగ్యాలు కలిగి వారికి అకాలమరణాలు రాకుండా ఉండాలని, దేశంలో అగ్నిప్రమాదాలు, వాహన ప్రమాదాలు మొదలైనవి జరగకుండా ఉండాలని, అన్ని సామాజిక వర్గాల • ప్రజలు సుఖశాంతులతో ఉండాలంటూ అర్చకస్వాములు సంకల్పాన్ని పఠించారు.తరువాత కార్యక్రమం నిర్విఘ్నంగా జరిగేందుకు మహాగణపతిపూజ జరిపి, శ్రీ సుబ్రహ్మణ్యస్వామివారికి అభిషేకము, సుబ్రహ్మణ్య అష్టోత్తరము అనంతరం సుబ్రహ్మణ్యస్తోత్రము పారాయణలు చేశారు.
సుబ్రహ్మణ్యస్వామి అభిషేకంలో స్వామివారికి పంచామృతాలైన పాలు, పెరుగు,తేనే,నెయ్యి, కొబ్బరినీళ్లు , వివిధ పండ్ల రసాలతో అభిషేక కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యంగా వివిధ పళ్ల రసాలతో చేసే అభిషేకంలో ఎంతో ఫలితం ఉంటుందని ఆగమాలు చెబుతున్నాయి.