శ్రీశైల దేవస్థానం:శ్రీశైలక్షేత్ర పరిశుభ్రత కార్యక్రమాలలో భాగంగా ఈ రోజు 06.01.2021న ‘స్వచ్ఛ శ్రీశైలం’ కార్యక్రమం నిర్వహించారు.
దేవస్థాన అన్ని విభాగాల యూనిట్ అధికారులు, పర్యవేక్షకులు, సిబ్బంది, పలువురు స్థానికులు ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా క్షేత్రపరిధిని మొత్తం 13జోన్లుగా విభజించారు.
కొత్తపేట, చెంచుకాలనీ, మల్లమ్మ మందిరప్రాంతం, దేవస్థాన అన్నదాన భవన ప్రాంతం, బాహ్యవలయ రహదారి (రింగ్ రోడ్డు), గ్యాస్ గోడౌన్, పంచమఠాల ప్రాంతం, నందిమండప ప్రాంతం, ఆర్.టి.సి బస్టాండ్ పార్కింగ్ స్థలం, కల్యాణకట్ట ప్రాంతం, పాతాళగంగ మెట్ల మార్గం, పాతాళగంగ పాతమెట్ల ప్రాంతం, సిబ్బంది వసతిగృహాల ప్రాంతం, గంగా – గౌరి సదన్ : మల్లికార్జునసదన్ ప్రాంతం, చల్లా వెంకయ్యసత్రం ప్రాంతం, భ్రమరాంబా అతిథిగృహ ప్రాంతం, దేవస్థానం వైద్యశాల ప్రాంతం, సాక్షిగణపతి ఆలయ ప్రాంతం, హటకేశ్వర ఆలయ ప్రాంతం, శిఖరేశ్వర ఆలయ ప్రాంతం మొదలైన ప్రదేశాలు ఈ జోన్లలో అంతర్భాగంగా ఉన్నాయి.
దేవస్థానం యూనిట్ అధికారులను, పర్యవేక్షకులను ఒక్కొక్క జోనకు ఇంచార్జి అధికారిగా నియమించారు.
ఈనాటి స్వచ్ఛ శ్రీశైలం కార్యక్రమంలో ఈ అధికారులందరు కూడా వారికి కేటాయించిన ఆయా ప్రదేశాలలో పారిశుద్ధ్య కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నారు.
కాగా ముందుగా ఈ ఉదయం 7 గంటలకు గంగాధరమండపం నుండి నందిమండపం వరకు అధికారులు, సిబ్బంది ‘స్వచ్ఛ శ్రీశైలం’ అవగాహన ర్యాలీని నిర్వహించారు.
ఈ సందర్భంగా కార్యనిర్వహణాధికారి ప్రసంగిస్తూ స్వచ్ఛ శ్రీశైల లక్ష్యం గురించి అందరిలో మరింత స్ఫూర్తి కలిగించేందుకు ఈ ప్రత్యేక కార్యక్రమం చేపట్టామన్నారు.శుచిశుభ్రతలకు భగవంతుడు ప్రసన్నమవుతాడని మనసంప్రదాయం చెబుతోందన్నారు. అందుకే ఆలయసంస్కృతిలో శుచిశుభ్రతలకు ఎంతో ప్రాధాన్యత ఉందన్నారు. ఈ క్షేత్రంలో పారిశుద్ధ్యాన్ని పాటించడమనేది నిరంతర ప్రక్రియ అని, ఏరోజుకారోజు ప్రతి ఒక్కరు ఈ విషయమై శ్రద్ధ కనబర్చాలన్నారు. శ్రీశైలక్షేత్రాన్ని ప్లాస్టిక్ లేని ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు దేవస్థానం కృతనిశ్చయంతో ఉందని పేర్కొన్నారు. ఇందుకు అవసరమైన ప్రత్యామ్నాయ ఏర్పాట్లను కూడా చేపడతామన్నారు. స్థానిక హోటళ్ళ నిర్వాహకులు, దుకాణాలవారు ప్లాస్టిక్ కవర్ల వినియోగాన్ని స్వచ్ఛందంగా నిరోధించాలన్నారు. కేవలం ఎవరికి వారు ఈ నియమాన్ని పాటించడం వలనే ప్లాస్టిక్ నిషేధించగలమన్నారు.
ప్రతినెలలో కూడా సమయానుకూలంగా ఈ స్వచ్ఛశ్రీశైలం కార్యక్రమాన్ని చేపట్టాలని దేవస్థానం సంకల్పించింది.