శ్రీశైలం శివరాత్రి బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజు అద్భుత ఘట్టాలు చోటుచేసుకున్నాయి . శ్రీశైల స్వామి అమ్మవార్లకు తిరుమల మహాక్షేత్రం నుంచి పట్టువస్త్రాలు అందాయి . తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారి అనిల్ కుమార్ సింగాల్ , పలువురు ప్రముఖులు శ్రీశైలం చేరుకున్నారు .వారికి శ్రీశైలం దేవేస్థానం కార్యనిర్వహణాధికారి భరత్, పలువురు అధికారులు , అర్చక స్వాములు స్వాగతం చెప్పారు . తిరుమల కార్యనిర్వహణాధికారి సింగాల్ తిరుమల పట్టువస్త్రాల పళ్ళెం శిరస్సుపై సగౌరవంగా మోసి శ్రీశైలం స్వామి అమ్మవార్లకు సంప్రదాయ పద్ధతులలో అందించారు .సింగాల్ కు శ్రీశైలం దేవస్థానం తరఫున మర్యాద చేసారు . ఈ సందర్భాలన్నీ చూపరులను ఆకర్షించాయి . అదేవిధంగా కాణిపాకం దేవస్థానం నుంచి పట్టువస్త్రాలు అందాయి . శ్రీశైలం దేవస్థానం వారు కాణిపాకం దేవస్థానం అధికారి ని సన్మానించారు . పాతాళగంగలో భక్తులు పుణ్యస్నానాలు చేసారు . ఎక్కడ చూసినా భక్తుల కోలాహలం కనిపించింది .
ఈ రోజు ప్రధానంగా మయూర వాహన సేవ జరిగింది . సంప్రదాయ పద్ధతిలో వాహనసేవ జరిగింది . ఈ ఊరేగింపులో భక్తులు , అధికారులు , అర్చక స్వాములు ఉత్సాహంగా పాల్గొన్నారు . వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కళాకారులు చూపిన విన్యాసాలు భక్తులను ఆకట్టుకున్నాయి . సాంస్కృతిక కార్యక్రమంలో జయప్రద రామమూర్తి వేణుగానం అలరించింది . శ్రీ కమలానంద భారతి శ్రీశైల క్షేత్ర దర్శనం చేసారు . ఆలయ మర్యాదలతో ఆయనకు స్వాగతం పలికారు . పవన్ చరణ్ , శ్రీమతి దివ్య ల గీత లహరి అలరించింది . భూకైలాస్ రూపకం భక్తులను ఆకట్టుకుంది . పలు కార్యక్రమాలతో శ్రీశైలం పులకించింది .