
శ్రీశైల దేవస్థానం:మకర సంక్రమణ పుణ్యకాలం సందర్భంగా పంచాహ్నిక దీక్షతో ఏడురోజులపాటు నిర్వహిస్తున్న సంక్రాంతి బ్రహ్మోత్సవాలలో ఆరవరోజైన ఈ రోజు 16.01.2021న శ్రీ స్వామి అమ్మవార్లకు విశేష పూజలు నిర్వహించారు.తరువాత శ్రీ స్వామివారి యాగశాలలో శ్రీ చండీశ్వరస్వామివారికి ప్రత్యేక పూజాదికాలు జరిగాయి. అనంతరం పూర్ణాహుతి, కలశోద్వాసన, త్రిశూలస్నానం, మహదాశీర్వచనంచేసారు.
పూర్ణాహుతి కార్యక్రమంలో నారికేళాలు, పలు సుగంధ ద్రవ్యాలు, నూతన వస్త్రాలు మొదలైన ద్రవ్యాలను హోమగుండంలోకి ఆహుతిగా సమర్పించి యాగపూర్ణాహుతి కార్యక్రమాన్ని పూర్తి చేసారు .అనంతరం వసంతోత్సవం జరిగింది.వసంతోత్సవం తరువాత చండీశ్వరస్వామికి ఆలయ ప్రాంగణంలో ని మల్లికాగుండంలో వైదికంగా అవబృధస్నానం నిర్వహించారు.
రేపటితో ముగియనున్న సంక్రాంతి బ్రహ్మోత్సవాలు
ఈ నెల 11వ తేదీ నుంచి నిర్వహిస్తున్న మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు రేపటి (17.01.2021) తో ముగియనున్నాయి. ఈ ఉత్సవాల ముగింపులో భాగంగా రేపు ఉదయం శ్రీ స్వామి అమ్మవార్లకు విశేష పూజలు ఉంటాయి. తరువాత రేపు సాయంకాలం శ్రీ స్వామి అమ్మవార్లకు అశ్వవాహనసేవ ,ఆలయ ఉత్సవం నిర్వహిస్తారు. ఆలయ ఉత్సవం అనంతరం శ్రీ స్వామి అమ్మవార్లకు పుష్పోత్సవం, ఏకాంతసేవ, శయనోత్సవం చేస్తారు.
* సంక్రాంతి బ్రహ్మోత్సవాల సందర్భంగా వేదసభ:
సంక్రాంతి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈ రోజు వేదసభ కార్యక్రమం జరిగింది.
శ్రీ స్వామి అమ్మవార్లకు ఆయా సేవలన్నీ పరిపూర్ణంగా జరిపించాలనే భావనతో ఈ వేదసభ కార్యక్రమం ఏర్పాటు చేసారు.
దేవస్థానం వేదపండితులతో పాటు స్థానికంగా ఉన్న వేదపండితులు, హైదరాబాద్, రాజమండ్రి, పశ్చిమగోదావరి జిల్లా ఇరగవరం, శ్రీకాళహస్తి, అన్నవరం, కాణిపాకం, విజయవాడ దుర్గామల్లేశ్వర దేవస్థాన వేదపండితులు కూడా ఈ వేదసభలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమములో స్థానికంగా ఉన్న వేదపండితులు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన 31 మంది వేదపండితులు ( మొత్తం 41) మంది ఈ వేదసభలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు ఉదయం ముందుగా అమ్మవారి ఆలయప్రాంగణంలోని ఆశీర్వచన మండపంలో అర్చకస్వాములు, వేదపండితులు, అధ్యాపక (స్థానాచార్యులు) లోకకల్యాణాన్ని కాంక్షిస్తూ సంకల్పాన్ని పఠించారు.
తరువాత కార్యక్రమం నిర్విఘ్నంగా జరగాలని గణపతి పూజ చేసారు.
అనంతరం జరిగిన ఋత్విగ్వరణ కార్యక్రమంలో ఉభయ దేవాలయాల ప్రధానార్చకులకు, స్థానాచార్యులకు, దేవస్థానం వేదపండితులకు, కార్యక్రమానికి విచ్చేసిన వేదపండితులకు కార్యనిర్వహణాధికారి నూతన వస్త్రాలు అందజేశారు.
కార్యనిర్వహణాధికారి కె. ఎస్. రామరావు ప్రసంగిస్తూ భారతీయ జీవన సర్వస్వానికి వేదాలే పరమాధారమన్నారు. భారతీయ సంస్కృతికి వేదసంస్కృతి అనే పేరు కూడా ఉందన్నారు.
మహర్షులు తమ తపస్సు చేత ఆయా వేదమంత్రాలను పొంది, లోకానికి అందించారన్నారు. ఆ వేదాలు గురుపరంపరగా వ్యాప్తిలోకి వచ్చాయన్నారు. వేదంలో సమస్త విషయాలు ఉన్నాయనే విషయం ఎంతో ప్రసిద్ధమన్నారు.అందుకే వేదం పేర్కొంటున్న ఆయా అంశాలను, ముఖ్యంగా సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు మొదలైన వాటిని సామన్యులకు కూడా అర్థమయ్యే రీతిలో సరళభాషలో ఆయా గ్రంథాలు వెలువడాల్సి ఉందన్నారు. దేవస్థానం కూడా ఆధ్యాత్మిక గ్రంథ ప్రచురణను విస్తరింప జేయాలని నిశ్చయించిందన్నారు.
ప్రతి ఒక్కరు కూడా ఉన్నతమైన మానసిక స్థితిని, పరిపూర్ణమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉండాలనే భావనను కూడా వేదం ఏనాడో చెప్పిందన్నారు. అందుకే సమాజంలో ప్రతి ఒక్కరు కూడా ఈ సుగుణాలను అలవర్చుకోవాలన్నారు. ఈ విషయమై వేదపండితులు అందరిలో తగిన అవగాహన కల్పించాలన్నారు. సంక్రాంతి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శ్రీస్వామివారి కైంకర్యంగా ఈ వేదసభ కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. ఈ వేదసభ కార్యక్రమముతో శ్రీశైల క్షేత్రం మరింత ఆధ్యాత్మిక శోభను సంతరించుకుందన్నారు.
అనంతరం దేవస్థానం వేదపండితులతో పాటు కార్యక్రమానికి విచ్చేసిన వేదపండితులు అమ్మవారి ఆలయ ప్రాంగణంలో వేదపారాయణలు చేశారు.
దాదాపు 3గంటలపాటు నిరంతరాయంగా ఈ వేదపారాయణలు కొనసాగాయి.