మహబూబ్ నగర్ జిల్లా కల్వకుర్తిని రెవెన్యూ డివిజన్ గా మర్చాలని వస్తున్న డిమాండ్ పై ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు మంగళవారం చర్చలు జరిపారు. జిల్లాకు చెందిన మంత్రులు లక్ష్మా రెడ్డి, జూపల్లి కృష్ణా రావు, ప్రణాళిక బోర్డు వైస్ చైర్మన్ నిరంజన్ రెడ్డి, కలెక్టర్ శ్రీదేవితో మాట్లాడారు. కల్వకుర్తి నియోజకవర్గం పరిధిలోని అమనగల్, మాడ్గుల, తలకొండపల్లి, కొత్తగా ఏర్పడే కడ్తాల మండలం ప్రతిపాదిత రంగారెడ్డి (శంషాబాద్) జిల్లాలో కలుస్తున్నాయి. దీంతో కల్వకుర్తిని రెవెన్యూ డివిజన్ చేసే అవకాశాలు లేవు. మహాబూబ్ నగర్ జిల్లా పరిధిలోనే వున్న కల్వకుర్తిలో ఇక కల్వకుర్తి, వెల్దండ మండలాలు మాత్రమే మిగులుతాయి. ఈ నేపథ్యంలో కల్వకుర్తి డివిజన్ ఏర్పాటు ఎలా? అనే ప్రశ్న తలెత్తింది. అయినప్పటికీ ప్రజల నుంచి డిమాండ్ వున్నందున కల్వకుర్తి డివిజన్ గురించి పరిశీలించాలని ముఖ్యమంత్రి చెప్పారు.