హైదరాబాద్, జూలై 9 : కాంక్రిట్ జంగిల్‌గా మారిన హైటెక్‌సిటీ ప్రాంతంలో పచ్చదనంతో నిండిన బొటానికల్ గార్డెన్లో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని గృహ నిర్మాణ,న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. కొత్తగూడ బొటానికల్ గార్డెన్లో చేపట్టిన అభివృద్ధి పనులను మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పరిశీలించారు. ప్రభుత్వ సలహాదారు రాజీవ్ శర్మ, పీసీసీఎఫ్ ప్రశాంత్ కుమార్ ఝా,అటవీ అభివృద్ధి సంస్థ ఎండీ చందన్ మిశ్రాతో కలిసి వెదురు ఉత్పత్తులతో నిర్మించిన అటవీ శాఖ కార్యాలయం, పర్యావరణ విజ్ఞాన కేంద్రం ఎడారి మొక్కలను పెంచిన కాక్టస్ గార్డన్, బట్టర్ ఫ్లై పార్క్ ను సందర్శించారు. అనంతరం దాదాపు రూ. 5 కోట్ల నిధులతో భారీ స్థాయిలో గార్డెన్‌ను దశలవారీగా అభివృద్ధి చేస్తున్న యోగా షెడ్, టెంట్ , ట్రీ కాటేజ్, లాగ్ హట్, వాకర్స్ పార్క్, చిన్న పిల్లల కోసం ప్రత్యేకంగా నిర్మిస్తున్న వీడియో హాల్, ఇండోర్,అవుట్ డోర్ అభివృద్ది పనుల గురించి మంత్రి ఇంద్రకణ్ రెడ్డికి వివరించారు. త్వరలోనే వీటిని అందుబాటులోకి తీసుకురానున్నట్లు అధికారులు తెలిపారు.