వరంగల్ జిల్లా మరిపెడ మండలంలోని చిన్నగూడూరు కేంద్రంగా కొత్త మండలం ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. డోర్నకల్ ఎమ్మెల్యే డి.ఎస్. రెడ్యానాయక్ శుక్రవారం క్యాంపు కార్యాలయంలో మరిపెడ మండల సీనియర్ నాయకులు గుడిపూడి నవీన్, రామసహాయం రంగారెడ్డి, మహేందర్ రెడ్డి, గుగులోత్ వెంకన్న తదితరులతో కలిసి మఖ్యమంత్రిని కలిసారు. పెద్ద మండలమైన మరిపెడ మండలంలో చిన్న గూడూరు కేంద్రంగా మండలం ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే రెడ్యానాయక్ ముఖ్యమంత్రిని కోరారు. మండల ప్రజల అభిప్రాయం కూడా చిన్న గూడూరు కేంద్రంగా మండలం ఏర్పాటు కావాలని ఉందని ఎమ్మెల్యే రెడ్యానాయక్ వివరించారు. మరిపెడలోని 5, నర్సింహపేటలోని 4, కురవిలోని 2, మహబూబాబాద్‌లోని 3 గ్రామాలను కలిపి చిన్నగూడూరు మండలాన్ని ఏర్పాటు చేయాలని ప్రతిపాదన ముఖ్యమంత్రికి అందించారు. దీనికి ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు. కొత్తగా ఏర్పడే మహబూబాబాద్ జిల్లాలో చిన్నగూడూరును కొత్త మండలంగా చేర్చాలని ఆదేశించారు.