పర్యావరణహితంగా దీపావళిని జరుపుకుందాం: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ పిలుపు
హైదరాబాద్ : చీకటిని పారద్రోలుతూ వెలుగులు తెచ్చే పండుగ దీపావళి అని, విజయానికి ప్రతీకగా దీపావళి జరుపుకుంటామని అలాంటి పవిత్ర దీపావళిని పర్యావరణ హితంగా జరుపుకోవాలని భారతీయ జనతాపార్టీ (బీజేపీ) రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్ పిలుపునిచ్చారు. మంగళవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పర్యావరణహితంగా దీపావళిని జరుపుకోవాలని కోరుతూ శ్వాస ఫౌండేషన్ రూపొందించిన పోస్టర్ ను ఆయన ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ బాణ సంచా కాల్చడం వల్ల శబ్ద కాలుష్యం పెరిగిపోతుందని, దీని ప్రభావం మెదడుపై ఎక్కువగా వుంటుందని అన్నారు. శబ్ద కాలుష్యంతో పాటు వాయు కాలుష్యం కూడా జరిగి పర్యావరణం కాలుష్య మవుతుందన్నారు. ధ్వని, వాయు కాలుష్యాల వల్ల వినికిడి లోపాలు, జీర్ణశక్తి, జీవక్రియ, రక్తప్రసరణలో అనేక మార్పులు సంభవిస్తాయన్నారు. కోపం, చికాకు పెరిగిపోతాయని వయసు మళ్లినవాళ్లకు తీవ్ర హాని జరిగే అవకాశం వుందని వైద్యులు నిర్దారించారని లక్ష్మణ్ పేర్కొన్నారు. భూతాపం పెరగడానికి కూడా కారణమవుతాయని,కాబట్టి ఇలాంటి వాటికి దూరంగా ఉండాలని, దీపాలతో దీపావళి జరుపుకోవాలని పిలుపునిచ్చారు. శ్వాస ఫౌండేషన్ అధ్యక్షురాలు మాట్లాడుతూ పర్యావరణంతోనే మనిషి జీవితం ముడిపడి వుందన్న విషయాన్న మర్చిపోరాదని, ఏ పండుగైనా పర్యావరణ హితంగానే జరుపుకోవాలన్నారు. వాతవారణ కాలుష్యం ముందు కాలంలో లాగా కాకుండా తీవ్రంగా పెరిగిపోతోందని, దీని వల్ల మనిషులకు అనేక రగాలు సంక్రమిస్తున్నాయని, ఇప్పటికైనా ప్రజలు పర్యావరణానికి ప్రధాన్యం ఇచ్చి తమ ఆరోగ్యాలను కాపాడుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో శ్వాస ఫౌండేషన్ ప్రతినిధులు రాఘవేంద్ర, పవన్ కుమార్, రవి రామకృష్ణ, వేణు మాధవ్, నందీశ్వర్, ధ్రువతేజ, రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.