నైపుణ్య అభివృద్ధి శిక్షణలో తెలంగాణ జాగృతి దేశానికి ఆదర్శం
స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్ ప్రారంభించిన రూడీ
కవిత కృషిపై కేంద్ర మంత్రులు, గవర్నర్, ఎంపీలు ప్రశంసలు
విద్య వ్యాపారంగా మారిపోయింది : గవర్నర్
నైపుణ్య అభివృద్ధి శిక్షణలో తెలంగాణ జాగృతి నిర్వహిస్తున్న నైపుణ్య అభివృద్ధి కేంద్రం దేశానికే ఆదర్శమని ప్రశంసించారు కేంద్ర స్కిల్స్ అభివృద్ధి మంత్రి రాజీవ్ ప్రతాప్ రూడీ. శుక్రవారం హైదరాబాద్ దోమల్‌గూడలోని ఏ.వి కాలేజ్ లో జరిగిన బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. నిజామాబాద్ ఎంపి, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవిత అధ్యక్షతన జరిగిన సభకు రాష్ట్ర గవర్నర్ నరసింహన్, కేంద్ర మంత్రి దత్తాత్రేయ, ఎంఐఎం అధ్యక్షుడు ఎంపి అసదుద్దీన్ ఒవైసీ, ఎంపీలు జితేందర్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. కవితపై గవర్నర్ నరసింహన్, కేంద్ర మంత్రులు రాజీవ్ ప్రతాప్‌రూడీ, బండారు దత్తాత్రేయతో పాటు ఎంపీలు ప్రశంసలు కురిపించారు. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్‌ను ఏర్పాటు చేయడం శుభపరిణామమని కొనియాడారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కవిత కృషి అభినందనీయమన్నారు.
ఎంపి కవిత మాట్లాడుతూ రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు పలు రంగాల్లో నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు తెలంగాణ జాగృతి స్కిల్స్ సెంటర్లను తెలంగాణ వ్యాప్తంగా అన్ని పార్లమెంటు నియోజక వర్గాల్లో ప్రారంభించినట్లు ఎంపి కవిత తెలిపారు. ఉపాధి అవకాశాలు కల్పించాలన్న లక్ష్యంతో సంస్థ పనిచేస్తోందన్నారు.
విద్య వ్యాపారంగా మారింది – గవర్నర్
తెలంగాణ జాగృతి రాష్ర్టానికి లాభం చేకూర్చే సంస్థ అని గవర్నర్ ప్రశంసించారు. ఇంజినీరింగ్ పట్టభద్రుడు ప్యూన్ ఉద్యోగం చేయడం కన్నా దురదృష్టకరం మరొకటి ఉండదన్నారు. దేశంలో విద్య వ్యాపారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశ విద్యా వ్యవస్థలో మార్పు రావాల్సిన అవసరం ఉందని తెలిపారు. విద్యలో స్కిల్ డెవలప్మెంట్ భాగంగా ఉండాలని చెప్పారు. స్కిల్ డెవలప్మెంట్ లేకపోతే మేకిన్ ఇండియా తయారు కాదన్నారు. ఈ విషయంలో జాగృతి సంస్థ సమాజం మొత్తాన్ని జాగృతం చేయాల్సిన అవసరం ఉందన్నారు.
జాగృతి అధ్యక్షురాలు కవితకు అభినందనలు : రూడీ
నిరుద్యోగుల కోసం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను ఏర్పాటు చేసిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, టీఆర్ఎస్ ఎంపీ కవితకు కేంద్ర మంత్రి రాజీవ్ ప్రతాప్ రూడీ అభినందనలు తెలిపారు. స్కిల్ డెవలప్మెంట్ శిక్షణలో తెలంగాణ జాగృతి దేశానికే ఆదర్శమని పేర్కొన్నారు. స్కిల్ డెవలప్మెంట్లో కవిత కృషి ప్రశంసనీయమన్నారు. స్కిల్ ఇండియా మిషన్‌ను ప్రధాని మోడీ ప్రారంభించారని తెలిపారు. దేశంలో మొదటిసారిగా కేంద్ర ప్రభుత్వం స్కిల్ డెవలప్మెంట్ కోసం ప్రత్యేక శాఖను తీసుకొచ్చిందని గుర్తు చేశారు. పదో తరగతి, ప్లస్ టు కోర్సులకు సమానమైన కోర్సులను వివిధ కారణాలతో చదువు మానేసిన వారికి అందుబాటులోకి తీసుకువచ్చామని తెలిపారు.. రెగ్యులర్ కోర్సులకు సమానమైన కోర్సులవి అని వివరించారు.
ప్రధాని కౌశల్ వికాస్ యోజన కింద రెండేళ్లలో రూ. 12 వేల కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. రానున్న రెండేళ్లలో రూ. 32 వేల కోట్లు ఖర్చు చేయనున్నామని వెల్లడించారు. దేశ వ్యాప్తంగా 25 వేల నైపుణ్య అభివృద్ధి శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఇండస్ట్రీకి అవసరమైన నైపుణ్యాలను యువతకు అందించాలన్నారు. చైనా జపాన్ లాంటి దేశాల్లో విద్యార్థులకు ఫ్యాక్టరీల్లో శిక్షణ ఇస్తున్నారని తెలిపారు. నిష్ణాతులైన ఉద్యోగుల కోసం ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూస్తున్నాయన్నారు.
నైపుణ్యత లేక బీటెక్ విద్యార్థులకు రూ. 5 వేల వేతనం ఉన్న ఉద్యోగం కూడా రావడం లేదన్నారు. ఐటీఐ విద్యార్థుల్లో ఉన్న నైపుణ్యత బీటెక్ విద్యార్థుల్లో లేదన్నారు. సమాజంలో ఒక వెల్డర్ ఎన్నో రకాల పనులు నిర్వర్తిస్తున్నారని గుర్తు చేశారు. కానీ వెల్డర్లలో ఉన్నతస్థాయి అధికారి కంటే ఎక్కువ సంపాదించే వారున్నారని చెప్పారు. వెల్డర్లకు సమున్నత గౌరవం దక్కట్లేదన్నారు. తెలంగాణ జాగృతి నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి అన్ని విధాలా అండగా ఉంటామని స్పష్టం చేశారు. జాగృతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో యువతకు చక్కని నైపుణ్య శిక్షణ అందుతుందని తెలిపారు. యువతకు నైపుణ్యతలో శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు కల్పించడం అభినందనీయమని రూడీ పేర్కొన్నారు.
శిక్షణను ఉపయోగించుకోవాలి
ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన కింద నడుస్తున్న నైపుణ్య శిక్షణ కేంద్రాల్లో చేరి నిరుద్యోగ యువత ఉపాధి అవకాశాలను పెంచుకోవాలని కోరారు కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ. నిరుద్యోగాన్ని నిర్మూలిస్తేనే దేశం అభివృద్ధి చెందుతున్నారు. స్కిల్స్ లేకుండా ఏ రంగంలోనూ రాణించలేమన్నారు. తెలంగాణలో ఉద్యోగావకాశాల పెంపుకు తనవంతు కృషి చేస్తానన్నారు దత్తాత్రేయ.
తెలంగాణలో భాగం జాగృతి
తెలంగాణ సాధనలో కీలక పాత్ర పోషించిన తెలంగాణ జాగృతి బంగారు తెలంగాణలో కూడా భాగమవడం అభినందించదగిన విషయమన్నారు ఎంపి జితేందర్ రెడ్డి. తెలంగాణ భవిష్యత్ యువత చేతిలో ఉంది. యువతకు మెరుగైన అవకాశాలు కల్పించే దిశగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. వేర్వేరు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను ఒకే గొడుకు కిందకు తేవాలనుకోవడం మంచి ఆలోచన అన్నారాయన.
స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను ఏర్పాటు చేసిన ఎంపీ కవితను అభినందించారు ఎంపి అసదుద్దీన్ ఒవైసీ. నైపుణ్యం గల యువత దేశానికి ఎంతో అవసరమన్నారు. ఉద్యోగావకాశాలను పెంచేందుకు స్కిల్స్ సెంటర్స్ ఉపయోగపడతాయన్నారు. సభలో ఎంపి మల్లారెడ్డి, బీబీ పాటిల్, కొత్త ప్రభాకర్ రెడ్డి, విశ్వేశ్వర్ రెడ్డి, నగేశ్‌తో పాటు బిజెపి రాష్ట్ర అధ్జ్ఞక్షుడు డాక్టర్ కె. లక్ష్మణ్, బిజెఎల్పీ నేత జి. కిషన్ రెడ్డి, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డితో పాటు తెలంగాణ జాగృతి రాష్ట్ర బాధ్యులు పాల్గొన్నారు.