హైదరాబాద్ విమానాశ్రయంతో పాటు ఇతర ప్రాంతాల్లో విమాన సౌకర్యాన్ని కల్పించేందుకు అవసరమైన వ్యూహాన్ని రూపొందించాలని పురపాలక శాఖ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు అధికారులను ఆదేశించారు. వరంగల్ జిల్లా మామునూరు, అదిలాబాద్, రామగుండం, జక్రాన్ పల్లి, కొత్తగూడెంలలో నూతనంగా విమానాశ్రయం ఏర్పాటుకు అవకాశాలున్నాయని తెలిపారు. ఈ ఐదు ప్రాంతాల్లో విమానాశ్రయం ఏర్పాటుకు అవసరమైన సర్వేలు నిర్వహించాల్సిందిగా ఈరోజు జరిగిన సమావేశంలో అధికారులను మంత్రి ఆదేశించారు.
బేగంపేట క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేష్ రంజన్ తోపాటు, టిఎస్ ఐసిఐసి అధికారులు, రాష్ట్ర ఏవియేషన్ కార్పొరేషన్ యండి భరత్ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.