డెన్మార్క్‌లో పూల జాతర…
హాజరయిన ఎంపి కవిత
ద్వీప కల్పాల సముదాయ దేశం డెన్మార్క్‌లో పూల జాతర వెల్లివిరిసింది. స్వాండినేవియన్ దేశాల్లో ఒకటయిన డెన్మార్క్ దేశంలోని సాబోర్గ్ నగరంలో జరిగిన బతుకమ్మ పండుగ ఆ నగరానికే వన్నె తెచ్చింది. తెలంగాణ జాగృతి డెన్మార్క్ శాఖ నిర్వహించిన బతుకమ్మ ఉత్సవాలకు నిజామాబాద్ ఎంపి, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవిత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. చుట్టూ సముద్రపు నీళ్లు, 11 డిగ్రీల ఉష్ణోగ్రత, అక్కడ దొరికే రంగురంగుల పూలతో తయారు చేసిన బతుకమ్మలు.. బతుకమ్మ…బతుకమ్మ ఉయ్యాలో…అంటూ వలయాకారంలో తిరుగుతున్న మహిళలను చూసి ప్రకృతి సైతం పరవశించింది. సాబోర్గ్ లో హోజె గ్లాడ్సాక్సే సెంటర్లో బతుకమ్మ ఆటా-పాటలను చూసి అక్కడి మహిళలు ఆసక్తిగా తిలకించారు. మరి కొందరు ఉత్సాహంగా బతుకమ్మ ఆట ఆడారు. ప్రవాస తెలంగాణ మహిళలతో కలిసి కవిత బతుకమ్మలను అందంగా పేర్చారు. పిల్లలు, పెద్దలు బతుకమ్మ పాటలు పాడుతూ ఉత్సాహంగా పాల్గొన్నారు.
బతుకమ్మ పండుగకు సొంతూరుకు వెళ్లలేక పోయామే అన్న బాధను కవితక్క మా దగ్గరికి వచ్చి తీర్చారని పలువురు మహిళలు సంబురాల్లో తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. డెన్మార్క్ క్రిస్మస్ ట్రీలను ఎగుమతి చేసే మా దేశంలో తెలంగాణవాసుల ఇలవేల్పు అయిన గౌరీమాతను కొలుస్తూ బతుకమ్మ పండుగ జరుపుకోవడం…ఇందులో మేమూ పాల్గొనడం మాకూ ఆనందంగా ఉందన్నారు సాబోర్గ్ నగర మహిళలు