రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 4 వ విడత హరితహారం కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు త్వరలోనే భూపాలపల్లి జిల్లాలో లాంఛనంగా ప్రారంభిస్తారని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.ఎస్.కె.జోషి తెలిపారు.
మంగళవారం సచివాలయంలో తెలంగాణకు హరితహారం, ధరణి ప్రాజెక్టు, స్వచ్ఛభారత్, భూసేకరణ అంశాలపై జిల్లా కలెక్టర్లతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ వీడియోకాన్ఫరెన్స్ లో అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ మిశ్రా, ముఖ్యకార్యదర్శులు, వికాస్ రాజ్, రాజీవ్ త్రివేది, ప్రత్యేక కార్యదర్శి స్మీతాసబర్వాల్, సియంఓ ఓఎస్ డి ప్రియాంక వర్గీస్, కార్యదర్శి బుద్ధప్రకాశ్ జ్యోతి, సిసిఎల్ ఏ డైరెక్టర్ కరుణ, ధరణి స్పెషల్ ఆఫీసర్ రజత్ కుమార్ షైని, పిసిసిఎఫ్ పి.కె.ఝా, టి.కె.శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.
సి.యస్ మాట్లాడుతూ హరితహారం కార్యక్రమాన్ని ప్రజా కార్యక్రమంగా నిర్వహించాలని, అన్ని వర్గాల ప్రజలు, ప్రతినిధులు భాగస్వాములు అయ్యేలా చూడాలని అన్నారు. పాఠశాల విద్యార్ధులను పెద్ద ఎత్తున పాల్గొనేలా చర్యలు తీసుకోవాలన్నారు. హరితహారం సన్నధతపై వివిధ జిల్లాల కలెక్టర్లతో సమీక్షించారు. వచ్చే సంవత్సరానికి సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి 100 కోట్ల మొక్కల లక్ష్యాన్ని నిర్ధేశించారని, దీని కనుగుణంగా ప్రతిగ్రామం, ప్రతి మున్సిపల్ వార్డులలో నర్సరీలను ఏర్పాటు చేయడంతో పాటు అవసరమైన స్ధలాల గుర్తించుటను చేపట్టాలన్నారు.
హరితహారం ఉపయోగాలపై విద్యార్థుల్లో అవగాహన, ఆసక్తిని పెంచేందుకు ప్రతి చోట వ్యాసరచన, ఉపన్యాస పోటీలు నిర్వహించాలన్నారు. విద్యార్థికి ఐదు మొక్కల చొప్పున పూలు, పండ్లు, నీడను ఇచ్చేవి ఇచ్చి, వాటి పెంపు బాధ్యతను అప్పగించాలన్నారు. అలాగే పర్యావరణం, హరితహారం ప్రాధాన్యతపై కవి సమ్మేళనం, సాంస్కృతిక శాఖ ద్వారా కళా జాతాల ప్రచారాన్ని విసృతంగా చేపట్టాలని సూచించారు. మంచి వర్షాలు కురుస్తున్న జిల్లాల్లో వాటిని సద్వినియోగం చేసుకుని, ఇప్పటికే ఏర్పాట్లు చేసుకున్న చోట్ల మొక్కలు నాటడం ప్రారంభించాలని ముఖ్యమంత్రి ఆదేశించారని, జిల్లా కలెక్టర్లు చీఫ్ సెక్రటరీ తెలిపారు. వర్షాలకు విరామం వచ్చి, మొక్కలకు నీరు అందని పరిస్థితి తలెత్తితే అవసరాన్ని బట్టి ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేయాల్సి ఉంటుందని, ఉపాధి హామీ నిధులను ఇందుకోసం అనుసంధానం చేస్తామన్నారు. రాష్ట్ర స్థాయి నుంచి మండల అధికారులు, సిబ్బందికి హరితహారంపై శిక్షణ పూర్తి కావొస్తోందని, ఆ పరిజ్ఞానంతో మరింత సమర్థవంతంగా నాటిన మొక్కల పర్యవేక్షణ ఉండాలన్నారు. అటవీ మొక్కలకు ప్రాధాన్యతను ఇస్తూ, కోతులు, ఇతర జంతువులు తినే పండ్ల జాతులను విసృతంగా నాటించాలన్నారు. అన్ని జిల్లాల్లో స్మృతి వనాల ఏర్పాటుకు ప్రాధాన్యతను ఇవ్వాలని, చనిపోయిన తమ ఆత్మీయుల పేరుతో మొక్కలు నాటించి, వాటి సంరక్షణ బాధ్యత ఆ కుంటుంబం తీసుకునేలా ప్రోత్సహిస్తే మంచి ఫలితాలు ఉంటాయన్నారు. రాష్ట్రంలోని ప్రతీ పట్టణం, గ్రామాలకు దారి తీసే అప్రోచ్ రోడ్లు రహదారి వనాలతో (అవెన్యూ ప్లాంటేషన్) చక్కగా తయారు కావాలన్నారు. గత మూడు హరితహారాల్లో చేసిన ప్లాంటేషన్లలో ఎక్కడైనా చనిపోయిన మొక్కలు, అంతరాలు (గ్యాప్) ఉంటే ఈ సారి వాటిల్లో పూర్తి స్థాయిలో పెద్ద మొక్కలు నాటించాలన్నారు. మిషన్ భగీరథ పనులు చివరి దశలో ఉన్నందున, పైపు లైన్ల నిర్మాణంలో ఇప్పటికే నాటిన మొక్కలు పోకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సమావేశంలో సూర్యాపేట కలెక్టర్ సురేంద్ర మోహన్ మాట్లాడుతూ జిల్లా పరిధిలో రెండు జాతీయ రహదారులు నిర్మాణంలో ఉన్నాయని తానంచర్ల నుంచి నకిరేకల్, సూర్యాపేట నుంచి జనగాం మధ్య రోడ్డు నిర్మాణం పూర్తి అయినంతవరకు అవెన్యూ ప్లాంటేషన్ పనులు మొదలు పెడతామన్నారు. కామారెడ్డి కలెక్టర్ సత్యనారాయణ వివరించిన జిల్లా హరితహారం ప్రణాళికను సి.యస్ తో సహా ఉన్నతాధికారులు ప్రశంసించారు.
ధరణి ప్రాజెక్టుపై సమీక్షిస్తూ పాసు పుస్తకాల కోసం డిజిటల్ సిగ్నేచర్ల ప్రక్రియను వేగవంతం చేయాలని సి.యస్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. గ్రామాలు, మండలాలు వారిగా సమీక్షిస్తూ లక్ష్యాల మేరకు రోజు వారి పురోగతిని సాధించాలన్నారు. సాంకేతికంగా ఎదురయ్యే సమస్యలపై రాష్ట్ర స్ధాయినుండి అధికారులు పర్యటించి పరిష్కరిస్తారని సి.యస్ తెలిపారు. మండల స్ధాయిలో, సెంట్రల్ స్ధాయిలో పాస్ పుస్తకాల ప్రింటింగ్ ను వేగవంతం చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. పాస్ పుస్తకాలలో తప్పుల సవరణలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలన్నారు.
అక్టోబర్ 2 నాటికి తెలంగాణ రాష్ట్రం పూర్తి ఓడిఎఫ్ సాధించాలన్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గారి ఆదేశాల మేరకు వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. సమయం తక్కువగా ఉన్నందున కలెక్టర్లు ప్రత్యేక దృష్టి సారించి నిర్మాణాలు పూర్తి చేసే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. కేంద్ర ప్రభుత్వం నుండి నిధులు విడుదల అవుతున్నాయని, మరుగు దొడ్ల నిర్మాణానికి అందుబాటులో ఉన్న నిధులు వినియోగించుకోవాలని తెలిపారు.
భూసేకరణకు సంబంధించి సేకరించిన భూముల వివరాలను వెంటనే అప్ లోడ్ చేయాలని సి.యస్ తెలిపారు.
ఈ అంశంపై ముఖ్యకార్యదర్శి వికాస్ రాజ్ మాట్లాడుతూ జివో.123, 2013 చట్టం ప్రకారం సేకరించిన భూముల వివరాల ఫైళ్ళను అప్ లోడ్ చేయాలని SDC,RDO లతో కలెక్టర్లు సమీక్షించాలన్నారు. భవిష్యత్తులో భూసేకరణ ప్రతిపాదనలను ఆన్ లైన్ లోనే స్వీకరించడం జరుగుతుందని వివరించారు. భూసేకరణ కోసం ప్రభుత్వం మంజూరు చేసిన నిధులకు యుటిలైజేషన్ సర్టిఫికేట్లతో పాటు పిడి అకౌంట్లలో జమ చేసిన వివరాలను అప్ లోడ్ చేయాలని ఆయన కలెక్టర్లను కోరారు. డిశంబర్ చివరి నాటికి భూసేకరణ చెల్లింపులు పెండింగ్ లో లేకుండా చూడాలని ప్రతిపాదనలను సిసిఎల్ఏ ద్వారా సమర్పించాలని తెలిపారు.