గత ప్రభుత్వాల హయాంలో సాగు భూములు కోల్పోయిన ఉప్పల్ భగాయత్ భూ బాధితులకు లాండ్ పూలింగ్ పద్దతిన ఫ్లాట్లను కేటాయించుతూ ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు దసరా కానుకనందించారు. దసరా పండుగ నాటికి ఎకరాకు వెయ్యిగజాల చొప్పున హెచ్ఎండీఏ డెవలప్ చేసిన వెంచర్ లో ఆయా రైతులకు ఫ్లాట్లను కేటాయించాల్సిందిగా ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. మల్కాజిగిరి ఎంపీ మల్లారెడ్డి ఆధ్వర్యంలో ఉప్పల్ భగాయత్ రైతులు మంగళవారం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రిని కలిసి ఈ మేరకు విజ్జప్తి చేశారు.
వంశపారంపర్యంగా సాగుచేసుకుంటున్న తమ భూములను అసైన్మెంట్, సీలింగ్ పేరుతో గత ప్రభుత్వాలు తీసుకున్నాయని తెలిపారు. అందుకు నష్ట పరిహారంగా తాము కోల్పోయిన ఎకరా ఒక్కంటికి వెయ్యిగజాల చొప్పున ప్లాట్లను కేటాయిస్తామని ఇచ్చిన హామీ పన్నెండేండ్లయిన అమలుకు నోచుకోలేదని వాపోయారు. తమ నుంచి తీసుకున్న భూముల్లో హెచ్ఎండీఏ అభివృద్ది పరిచిన లేఅవుట్లో కేటాయిస్తామని అప్పటి కాంగ్రేస్ ప్రభుత్వం హామీ ఇచ్చిందని… అయితే ఇప్పటివరకు తమకు ఫ్లాట్లను కేటాయించ లేదని ఉప్పల్ భగాయత్ రైతులు సిఎంకు విన్నవించారు.
నాగోల్ దగ్గర మూసీకి ఉత్తరాన రోడ్డుకిరువైపుల ఉన్న మొత్తం 754 ఎకరాల తమ భూమిని అప్పటి వైఎస్సార్ ప్రభుత్వం పన్నెండేండ్ల కింద వాపసు తీసుకున్నదని తెలిపారు. కాగా సీలింగ్ పేరుతో తీసుకున్న 54 ఎకరాల భూమికి నష్టపరిహారం చెల్లించకుండా కనీస హామీ కూడా గత ప్రభుత్వాలు ఇవ్వలేదని వారు సిఎం దృష్టికి తెచ్చారు. రైతుల సమస్యను విన్న సిఎం అక్కడికక్కడే పరిష్కార మార్గం చూపుతూ దసరా నాటికి సమస్యను పరిష్కరించాలని అన్నారు. వారికి ఫ్లాట్లను కేటాయించి ప్రభుత్వం వారిని ఆదుకుంటుందని స్పష్టం చేశారు. కాగా (అసైన్డ్) పట్టా భూములకు వెయ్యి గజాలు ఇస్తున్న నేపధ్యంలో (సీలింగ్) పట్టా (54 ఎకరాలు) భూముల రైతులకు ఎకరాకు 600 గజాల చొప్పున ప్రభుత్వం ప్లాట్లను కేటాయిస్తదని సిఎం రైతుల హర్షాధ్వానాల మధ్య ప్రకటించారు. ఇందుకు సంబంధించి కేటాయింపుల వ్యవహరం దసరాలోపు పూర్తి చేయాలని తెలిపిన సిఎం, సమస్య పరిష్కారం కావడంతో ఉప్పల్ భగాయత్ భూముల రైతులు సంతోషంతో పండుగ చేసుకోవాలని సిఎం ఆకాంక్షించారు. ఈ మేరకు అక్కడికక్కడే మంత్రి కెటి. రామా రావుకు ఎంపీ మల్లారెడ్డికి సూచించారు. దాంతో సంతోషం పట్టలేని రైతులు జై తెలంగాణ జై కెసిఆర్ నినాదాలు చేస్తూ తమ పన్నెండేల్ల సమస్యకు శాశ్వత పరిష్కారం దొరకడంతో సిఎం కెసిఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మంత్రి కెటి. రామా రావు, ఎంపీ మల్లారెడ్డితో పాటు టిఆర్ఎస్ పార్టీ ఉప్పల్ ఇన్చార్జ్ బేతి సుభాష్ రెడ్డి, ఎల్బీనగర్ టిఆర్ఎస్ పార్టీ ఇన్చార్జ్ ముద్దగాని రామ్మోహన్ గౌడ్, రైతు సంఘం నాయకులు, పలువురు రైతులు,కార్పోరేటర్లు పాల్గొన్నారు.