కొత్తగా ఏర్పడిన జిల్లా కేంద్రాలు అనతికాలంలోనే అభివృద్ది కేంద్రాలుగా మారతాయని, అవి అడ్డదిడ్డంగా, అస్తవ్యస్తంగా పెరగకుండా ప్రణాళికాబద్ధంగా వుండేలా కార్యచరణ రూపొందించాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. కొత్త జిల్లాలు, రెవిన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటు తర్వాత అనేక కొత్త ప్రాంతాలు అభివృద్ది పథంలో దూసుకుపోతాయన్నారు. క్యాంపు కార్యాలయంలో శనివారం కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత పాలనావ్యవస్థపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, సిఎంఒ ముఖ్య కార్యదర్శి నర్సింగ్ రావు, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రదీప్ చంద్ర, ఆర్ అండ్ బి ముఖ్య కార్యదర్శి సునిల్ శర్మ, జిఎడి కార్యదర్శి అధార్ సిన్హా, ఆర్ అండ్ బి ఇఎన్సి గణపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
జిల్లా కేంద్రాలన్నీ త్వరలోనే పెద్ద పట్టణాలుగా, నగరాలుగా వృద్ధి చెందుతాయని సిఎం అన్నారు. తెలంగాణలో పట్టణ జనాభా ఇప్పటికే 45 శాతం ఉందని, ఇది యింకా పెరిగే అవకాశం ఉందని సిఎం అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో పట్టణాల అభివృద్ధి పట్ల ప్రత్యేక చొరవ తీసుకోవాలని సిఎం సూచించారు. ప్రతి జిల్లా కేంద్రం చుట్టూ ఔటర్ రింగ్ రోడ్డు నిర్మించాలని, ప్రభుత్వ కార్యాలయాలు, నివాస గృహాలు, పరిశ్రమలు, వాణిజ్య సముదాయాలు, మౌలిక వసతులు తదితర నిర్మాణాలు ఎక్కడ ఎలా వుండాలనే విషయంపై సమగ్ర ప్రణాళికలు వుండాలన్నారు. ఎవరి ఇష్టం వచ్చినట్లు వాళ్లు నిర్మాణాలు జరుపకుండా సమగ్ర పట్టణాభివృద్ధి ని దృష్టిలో పెట్టుకుని చేసేలా విధానరూపకల్పన చేయాలన్నారు. హెచ్ఎండిఎ, కుడ (KUDA) తరహాలో ప్రతి జిల్లా కేంద్రానికి పట్టణాభివృద్ది సంస్థలను ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని సిఎం అధికారులకు సూచించారు. పట్టణంలోనే కాకుండా పట్టణం చుట్టూ కూడా దాదాపుగా 10 కిలోమీటర్ల విస్తీర్ణంలో లే ఔట్లు రూపొందించాలని సూచించారు. హైదరాబాద్ నగరం మాదిరిగా పట్టణ ప్రాంతాలు కిక్కిరిసి పోకుండా వుండేందుకు ఇప్పటి నుండే అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. భవిష్యత్తులో పెరిగే జనాభాను కూడా అంచనా వేసి క్రమ పద్ధతిలో పట్టణాలు విస్తరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. కొత్తగా నియమితులైన కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు అత్యంత ఉత్సాహంతో పనిచేస్తున్నారని, వారికి తగు సూచనలు చేసుకుంటూ పరిపాలనా సజావుగా సాగేలా చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు సూచనలు చేశారు. ఆయా జిల్లాల్లో వున్న స్థానిక వనరులను గుర్తించి వాటిని ఉపయోగంలోకి తేవాలన్నారు.