ఆదిలాబాద్ జిల్లాలో ఆసిఫాబాద్ కేంద్రంగా మరో జిల్లాను ఏర్పాటు చేసే ప్రతిపాదనలు పరిశీలించాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. ఎమ్మెల్యే కోవ లక్ష్మీతో పాటు ఆదిలాబాద్ జిల్లాకు చెందిన మంత్రులు, ఇతర ప్రతినిధులు ఏకగ్రీవంగా ఆసిఫాబాద్ జిల్లాను ప్రతిపాదించారు. దీంతో జిల్లాలో మండలాలు, డివిజన్లు, జిల్లాల కూర్పుపై ఆ జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులతో ముఖ్యమంత్రి ప్రత్యేకంగా కసరత్తు చేశారు. ఆదిలాబాద్ జిల్లాను 20 మండలాలతో, కొమురం భీం మంచిర్యాల జిల్లాను 13 మండలాలతో, ఆసిఫాబాద్ జిల్లాను 15 మండలాలతో, నిర్మల్ జిల్లాను 18 మండలాలతో ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన రూపొందింది. జిల్లాలో కొత్తగా 16 మండలాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. బెల్లంపల్లి, ముథోల్ డివిజన్లు ఏర్పాటు చేయాలని, క్యాతంపల్లిని నగర పంచాయితీగా మార్చాలని, బాసర కేంద్రంగా కొత్త మండలం ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు.