అతిగొప్ప పాలనా సంస్కరణగా పరిగణించబడే జిల్లాల పునర్వ్యస్థీకరణ ద్వారా ప్రజలకు మేలైన సేవలు అందించడమే లక్ష్యంగా పరిపాలనా విభాగాలు ఉండాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు అన్నారు. ప్రతీ జిల్లాలో ఒకే విధమైన పరిపాలనా విభాగం, ఉద్యోగుల సంఖ్య ఉండాలనే ఖచ్చితమైన నిబంధన ఏమీ లేదని ముఖ్యమంత్రి చెప్పారు. ఆయా జిల్లాల్లోని స్వభావం, స్వరూపం, పనితీరు, అవసరాన్ని బట్టి విభాగాల విస్తరణ, కుదింపు, సర్దుబాటు ఉండాలని సిఎం అన్నారు. ప్రభుత్వ శాఖల పనితీరును మెరుగుపర్చడం, సమర్ధ పర్యవేక్షణ, సంపూర్ణ పర్యవేక్షణ, పారదర్శకమైన పాలన, అవినీతి నిర్మూలన, ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల సత్వర అమలు లక్ష్యాలుగా వివిధ జిల్లాల్లో ప్రభుత్వ శాఖల పునర్వ్యస్థీకరణ జరగాలన్నారు. ఒకే స్వభావం కలిగిన పనులు చేసే అధికారులు వేర్వేరు విభాగాల కింద ఉన్నారని, దీనివల్ల సమన్వయం లోపిస్తుందని, అంతిమంగా కార్యక్రమాల అమలు విఘాతం కలుగుతున్నదని సిఎం చెప్పారు. ఈ గందరగోళాన్ని నివారించడానికి ప్రభుత్వ శాఖల్లో సరళీకరణ జరగాలని సిఎం చెప్పారు. రెవిన్యూ, పోలీస్, వైద్య ఆరోగ్యం, విద్య పంచాయతిరాజ్, తదితర శాఖలకు ప్రతీ జిల్లాలో పని ఉంటుందని, కానీ అటవీ శాఖ మున్సిపల్, మైనారిటీ, ఎస్టీ సంక్షేమం, హర్టికల్చర్, పరిశ్రమలు తదితర శాఖల్లో అన్ని జిల్లాల్లో ఒకే విధంగా పని భారం ఉండదని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. జిల్లాల్లో పనిభారాన్ని బట్టి ఆయా శాఖలను విస్తరించడం, సర్దుబాటు చేయడం జరగాలన్నారు.
జిల్లాల్లో ఉండాల్సిన పరిపాలనా విభాగాల కూర్పుపై హెచ్ఆర్డిలో గురువారం ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు సమీక్ష జరిపారు. మంత్రులు హరీశ్ రావు, జగదీష్ రెడ్డి, ఎంపి బి. వినోద్ కుమార్, మిషన్ భగీరథ వైస్ చైర్మన్ ప్రశాంత్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, వివిధ శాఖల కార్యదర్శులు పాల్గొన్నారు.
‘‘హైదరాబాద్ చుట్టు పక్కల పరిశ్రమల శాఖకు పని ఎక్కువ ఉంటుంది. అక్కడ ఆ శాఖ విస్తరించాలి. గ్రామీణ జిల్లాల్లో పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలు బాగు పడాలి. అడవులు ఎక్కువ ఉన్న భూపాలపల్లి, కొత్త గూడెం, మంచిర్యాల లాంటి జిల్లాల్లో ఆ శాఖ కార్యకలాపాలు ఎక్కువ చేయాలి. ఉద్యానవనాలు ఎక్కువ వుండే చోట హర్టికల్చర్ శాఖ మెరుగవ్వాలి. అవసరమైతే ఆయా శాఖల్లో కొత్తగా ఉద్యోగాలు సృష్టించాలి. పనిభారం లేని చోట కూడా తప్పక ఆయా శాఖల విభాగాలు ఉండాల్సిన అవసరం లేదు. గిరిజనులు లేని జిల్లాల్లో గిరిజన సంక్షేమ శాఖ అధికారి అవసరమా? అడవులు లేని చోట అటవీ అధికారి అవసరమా? అవసరాన్ని బట్టి ప్రభుత్వ విభాగాలు వుండాలి’’ అని ముఖ్యమంత్రి సూచించారు.
‘‘ఒకే స్వభావం కలిగిన పనులు చేయడానికి వేర్వేరు అధికారులన్నారు. దీనివల్ల గందరగోళం, సమన్వయ లోపం ఏర్పడుతోంది. కాబట్టీ శాఖల పునరేకీకరణ జరగాలి. ఎస్ఎస్ఎ, ఆర్ఎస్ఏ, పాఠశాల విద్య, ఇలా వివిధ విభాగాలను పర్యవేక్షించే బాధ్యత ఒకే జిల్లా విద్యాధికారి పరిధిలోకి తేవాలి. కుటుంబ సంక్షేమం, లెప్రసీ, ఎయిడ్స్, ఇమ్యూనైజేషన్, ట్రైనింగ్, మలేరియా తదితర విభాగాలన్నింటినీ డిఎంహెచ్ఓ పరిధికి తేవాలి. వైల్డ్ లైఫ్, ఫారెస్ట్, సోషల్ ఫారెస్ట్ విభాగాలు ఒకే అటవీ అధికారి పర్యవేక్షణ కింద వుండాలి. మైనర్, మీడియం ఇరిగేషన్ లకు ఒకే అధికారి ఉండాలి ఇలా అన్ని శాఖలు పునరేకీకరణ జరగాలి’’ అని ముఖ్యమంత్రి చెప్పారు. ‘‘ప్రత్యేక లక్ష్యం సాధించడం కోసం ప్రభుత్వం కొన్ని కార్యక్రమాలు చేపడుతుంది. దాని కోసం ఉద్యోగులను నియమించాం ఆ పని పూర్తయిన తర్వాత వారిని వేరే పనికి ఉపయోగించాలి. పని లేకున్నా ఆ శాఖలను, విభాగాలను కొనసాగించవద్దు, వారిని పని భారం ఎక్కువున్న చోట వాడుకోవాలి. సర్వే శాఖలాంటి కొన్ని శాఖల ప్రాధాన్యం, అవసరం పెరుగుతుంది. అవి మరింత విస్తరించాలి’’ అని సిఎం సూచించారు.
కొన్ని ప్రభుత్వ శాఖల్లో ఇంకా అవినీతి ఉంది. ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అక్కడ సంస్కరణలు రావాలి. ముఖ్యంగా రెవెన్యూ శాఖ బాగా మారాలి. రెవెన్యూ శాఖలో సిటిజన్ చార్టర్ అమలు చేయాలి. ప్రజలకు పారదర్శకమైన, అవినీతి రహితమైన పాలన అందాలి అని ముఖ్యమంత్రి చెప్పారు.
‘‘చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ ప్రాధాన్యం విస్తరించాలి. మరింత బాగా ప్రణాళికలు జరగాలి. మండల స్థాయిలో కూడా ప్రణాళికలు తయారు కావాలి. స్థానిక వనరులను గుర్తించి ఉపయోగంలోకి తెవాలి. మిషన్ కాకతీయలో చెరువులు బాగుపడ్డాయి. మత్స్య పరిశ్రమను అభివృద్ధి చేయాలి. కొత్తగా ఏర్పడే జిల్లాల్లో మున్సిపాలిటీల సంఖ్య ఆధారంగానే మున్సిల్ శాఖ పబ్లిక్ హెల్త్ డిపార్ట్ మెంట్ విస్తరించాలి’’ అని సిఎం అన్నారు.
‘‘కొన్ని చోట్ల ఒక్కో అధికారిని ఒక్కో పేరుతో పిలుస్తున్నారు. జిల్లా స్థాయి అధికారిని వారి కేడర్ తో సంబంధం లేకుండా జిల్లా అధికారి అనే హోదా కల్పించాలి. మండల రెవెన్యూ అధికారిని తహసిల్దార్ అనే పిలవాలి. నాయబ్ తహసీల్దార్ (డిప్యూటీ ఎమ్మార్వో), గిర్దావర్ (RI) అని పిలవాలి’’ సిఎం చెప్పారు.
ఎక్కువ జిల్లాలున్న రాష్ట్రాలలో పరిపాలనా విభాగాలు ఎలా వుండాలనే విషయాలను అధ్యయనం చేయడానికి సీనియర్ అధికారులు వెళ్లాలని సిఎం ఆదేశించారు. ఉత్తరప్రదేశ్ కు ఎస్.కె.జోషి, మధ్యప్రదేశ్ కి సోమేశ్ కుమార్, చత్తీస్ గఢ్ కి మీనా, హర్యానాకు నవీన్ మిట్టల్, ఒరిస్సాకు బిపి ఆచార్య, తమిళనాడుకు అజయ్ మిశ్రా, బీహార్ కు ఎస్.పి. సింగ్ వెళ్లి అధ్యయనం చేయాలని ఆదేశించారు.
మధ్యాహ్నం సెషన్
——————-
– ప్రతీ శాఖ జిల్లా విభాగాధిపతుల నియామకం వెంటనే జరపాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అన్నారు. సీనియారిటీ ప్రాతిపదికన జిల్లా అధికారుల నియామకం జరపాలన్నారు. ప్రతీ శాఖ కూడా డి.పి.సి. నిర్వహించి పదోన్నతులు ఇవ్వాలని అన్నారు. పని భారం ఎక్కువ ఉన్న శాఖల్లో అవసరమైన ఉద్యోగులను నియమిస్తామని, దీనికోసం ప్రతిపాదనలు పంపాలని సిఎం చెప్పారు. పరిపాలనా విభాగాల విస్తరణ జరుగుతుంది కాబట్టి, ఆయా విభాగాల ఇన్ చార్జిలకు అధికారాలు, విధుల బదలాయింపు జరగాలని సిఎం ఆదేశించారు. రాష్ట్రంలో ఇప్పుడు పెద్ద ఎత్తున నీటి ప్రాజెక్టులు కడుతున్నామని, రహదారులు నిర్మిస్తున్నామని, మిషన్ భగీరథ చేపట్టామన్నారు. వీటి కోసం చాలా మంది ఉద్యోగులను నియమిస్తున్నామని, ఆ పని పూర్తయిన తర్వాత ఆ ఉద్యోగులను మరో పనికి ఉపయోగించే విషయంలో అవసరమైన కార్యాచరణ రూపొందించాలన్నారు. ఉద్యోగులను తమ వృత్తి స్వభావాన్ని బట్టి ఏ బాధ్యతలకు, ఏ ప్రాంతానికైనా బదిలీ చేసే వెసులుబాటు ప్రభుత్వానికుండేలా నిబంధనలు తయారు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
– ‘‘పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, ఎలక్ట్రికల్ ఇన్ స్పెక్టర్ ఆఫీస్, జీవిత బీమా జిల్లా అధికారి, డిడి షుగర్ కేన్, జైళ్ల శాఖ జిల్లా అధికారి, డివిజనల్ ఫైర్ ఆఫీసర్, సైనిక్ వెల్ఫేర్ అధికారి తదితర కార్యాలయాలు ప్రతీ చోట ఉండాల్సిన అవసరం లేదు. అవసరాన్ని బట్టి కార్యాలయాలుండాలి’’ అని సిఎం చెప్పారు.
– ‘‘జిల్లాల పునర్వ్యస్థీకరణను ఓ అవకాశంగా తీసుకుని ప్రజలకు మెరుగైన సేవలు అందించడం కోసం ఇంకా ఎలాంటి కార్యక్రమాలు చెప్పట్టవచ్చో అధికారులు సూచనలు చేయాలి. తెలంగాణ పరిస్థితులను అవగతం చేసుకుని, ఇక్కడి భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకుని ఆచరణీయమైన పద్ధతులు అన్వేషించాలి. మంచి పాలన అందించడం కోసం ప్రభుత్వానికి మీరు చేసే సూచనలు చాలా కీలకం’’ అని సిఎం అన్నారు.