శ్రీశైల దేవస్థానం ఉగాది ఉత్సవాలు  శాస్త్రానుసారం  ప్రారంభం

శ్రీశైల దేవస్థానం: ఉగాది ఉత్సవాలు  శాస్త్రానుసారం  ప్రారంభమయ్యాయి.  ఐదురోజులపాటు 6 నుండి 10 వరకు  జరుగుతాయి. ఈ ఉదయం ఆలయ ప్రాంగణంలో ఉత్సవ ప్రారంభ కార్యక్రమాలు ఆగమ శాస్త్రానుసారం
జరిగాయి. ఈ సందర్భంగా శ్రీస్వామిఅమ్మవార్లకు విశేషపూజలు జరిపారు.

యాగశాల ప్రవేశం :

ముందుగా కార్యనిర్వహణాధికారి, స్థానాచార్యులు (అధ్యాపక),  అర్చకస్వాములు, వేదపండితులు, అధికారులు సంప్రదాయబద్దంగా ఆలయ ప్రాంగణంలో స్వామివార్ల యాగశాల ప్రవేశం చేశారు.

వేదస్వస్తి :

ఆలయప్రవేశం చేసిన వెంటనే వేదపండితులు వేద పారాయణలు చేసి వేదస్వస్తి నిర్వహించారు.

శివసంకల్పం :

వేదపఠనం అయిన వెంటనే స్థానాచార్యులు ( అధ్యాపక) , అర్చకస్వాములు, వేదపండితులు,
లోకక్షేమాన్నికాంక్షి స్తూ ఉత్సవ సంకల్పాన్ని పఠించారు. దీనికే శివసంకల్పం అని పేరు.

ఈ సంకల్పంలో దేశం శాంతి సౌభాగ్యాలతో విలసిల్లాలని, ప్రకృతి వైపరీత్యాలు సంభవించ
కుండా సకాలంలో తగినంత వర్షాలు కురిసి దేశం పాడిపంటలతో తులతూగాలని, జనులందరికి
ఆయురారోగ్యాలు కలిగి వారికి అకాల మరణాలు జరగకుండా ఉండాలని, దేశంలో అగ్నిప్రమాదాలు,
వాహన, ప్రమాదాలు మొదలైనవి జరగకుండా ఉండాలని, ప్రజలందరు సుఖశాంతులతో
ఉండాలంటూ ఆలయ అర్చకులు, వేదపండితులు సంకల్ప పఠనం చేశారు.

గణపతి పూజ :
సంకల్పపఠనం తరువాత ఉత్సవాలు నిర్విఘ్నంగా జరగాలని మహాగణపతి పూజ జరిపారు.

పుణ్యాహవచనం :
గణపతిపూజ తరువాత పుణ్యాహవచనం చేసారు. వృద్ధి , అభ్యుదయాల కోసం
ఈ పుణ్యహవచనం జరిపారు.

చండీశ్వరపూజ :

సంకల్పపఠనం తరువాత చండీశ్వరపూజ జరిగింది. ఈ ఉత్సవాలు క్షేత్రపాలకుడైన
వీరభద్రస్వామి పర్యవేక్షణలో, శివపరివార. దేవతలలో ఒకరైన చండీశ్వరుని నాయకత్వంలో
నిర్వహిస్తారని ప్రతీతి.

అందుకే యాగశాల ప్రవేశం తరువాత చండీశ్వరుని ప్రత్యేకంగా పూజాదికాలు జరపించడం
సంప్రదాయం.

కంకణ పూజ, కంకణధారణ

చండీశ్వరపూజ తరువాత కంకణాలకు (రక్షాబంధనాలకు)  పూజాదికాలు
జరిపారు. తరువాత అధికారులు, అర్చకస్వాములు కంకణాలను ధరించారు.

బుత్విగ్వరణం :

కంకణధారణ తరువాత బుత్విగ్వరణం నిర్వహించారు. ఉత్సవాలలో ఆయా వైదిక
కార్యక్రమాలు నిర్వహించాలని  బుత్వికులను ఆహ్వానిస్తూ వారికి దీక్షావస్త్రాలను  అందజేసే
కార్యక్రమానికే బుత్విగ్వరణం అని పేరు.

అఖండస్థాపన :

బుత్విగ్వరణం తరువాత అఖండ దీపస్థాపన చేశారు. అనంతరం వాస్తుపూజ   జరిగింది.

రుద్రకలశస్థాపన :

వాస్తు హోమం తరువాత మండపారాధన చేసి ప్రత్యేక కలశస్థాపన చేసారు . కలశస్థాపన
తరువాత కలశార్చన జరిగింది. తరువాత పంచావరణార్చనలు నిర్వహించారు.  అనంతరం లోకకల్యాణం కోసం జపానుష్టానాలు జరిపారు.

అంకురార్పణ :

ఉత్సవాల మొదటిరోజు సాయంకాలం  అంకురార్పణకు ఎంతో విశేషముంది.
ఆలయ ప్రాంగణంలోని నిర్ణీత పునీత ప్రదేశములోని మట్టిని సేకరించి   యాగశాలకు తీసుకువచ్చారు. దీనినే “మృత్సంగ్రహణం” అంటారు. తరువాత ఈ మట్టిని తొమ్మిది  పాలికలలో (మూకుళ్ళలో) నింపి, దాంట్లో నవధాన్యాలను పోసి, ఆ మట్టిలో మొలకెత్తించే పనిని  ప్రారంభించారు.
ఈ అంకురారోపణ కార్యక్రమానికి చంద్రుడు అధిపతి, శుక్లపక్ష చంద్రునివలే పాలికలలోని నవధ్యానాలు
సైతం దినదినాభివృద్ధి చెందాలని ప్రార్థించారు. పాలికలలో రోజూ నీరు పోసి నవధాన్యాలు పచ్చగా
మొలకెత్తేలా చూస్తారు. అలంకారాలను ఆరోపింపజేసే కార్యక్రమం కాబట్టే దీనికి అంకురార్పణ అని
పేరు.

భృంగివాహనసేవ:

ఈ ఉత్సవాలలో భాగంగానే ఈ సాయంకాలం స్వామిఅమ్మవార్లకు భృంగివాహనసేవ
నిర్వహించారు. ఈ సేవలో శ్రీ స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులను భృంగివాహనసేవపై వేంచేబు
చేయించి, విశేషంగా అలంకార మండపములో పూజాదికాలు జరిపారు. తరువాత
గ్రామోత్సవం జరిగింది.

భృంగి వాహనాధీశులైన శ్రీస్వామిఅమ్మవార్లను దర్శించడం వలన పనులలో ఏకాగ్రత
లభిస్తుందని, పాపాలను హరించబడుతాయని నమ్మకం.

 

మహాలక్ష్మీ అలంకారం:

ఉత్సవాలలో భాగంగా ఈ రోజు  శ్రీ అమ్మవారి ఉత్సవమూర్తికి మహాలక్ష్మీ
అలంకారం, గ్రామోత్సవం జరిగాయి.

చతుర్భుజాలు గల ఈ దేవిపై రెండు చేతులలో పద్మాలను, క్రింది చేతులలో కుడివైపున
అభయ హస్తం, ఎడమ వైపు వరముద్రతో దర్శనం ఇచ్చారు. మహాలక్ష్మి స్వరూపాన్ని దర్శించడం
వలన శత్రుబాధలు నివారించబడి, సకల శుభాలు కలుగుతాయని నమ్మకం.

గ్రామోత్సవంలో శంఖం, డమరుకం, జే గంట, కొమ్ము వాయిద్యం, కోలాటం, చెక్కభజన,
జానపద పగటి వేషాల ప్రదర్శన, తప్పెటచిందు, కర్టాటక జాంజ్‌, కర్టాటక డోలు విన్యాసాలు, వీరగాసీ,
జానపదడోలు, నందికోలుసేవ, కంచుడోలు మొదలైన కళా రూపాలను ఏర్పాటు చేసారు.

print

Post Comment

You May Have Missed